: కేవలం లుంగీ కట్టుకుని.. డొక్కు సైకిల్ మీద తిరిగే.. ఈ ముసలాయన ఓ మహానుభావుడు!


ఎందరో మహానుభావులు... అందులో కొందరి గురించే మనకు తెలుసు. కానీ గత ఎన్నికల సందర్భంగా జరిగిన ఓ సంఘటన ఓ ఆదర్శనీయమైన వ్యక్తిని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇప్పుడాయన సోషల్ మీడియాలో సంచలనం. యువకులంతా ఆయన ఫోటోలు, ఆయన గురించిన విశేషాలను షేర్ చేసుకుంటూ, ఆయనకు సంబంధించిన పోస్టులకు లైక్ కొడుతూ, ఆయన మహనీయుడని కామెంట్లలో కొనియాడుతున్నారు. ఆయన కథాకమామీషులోకి వెళ్తే...ఉత్తరప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అక్కడి ప్రజల కోసం పని చేేస్తున్న బక్క పలుచని వ్యక్తి పట్ల ప్రభుత్వాధికారులు దురుసుగా ప్రవర్తించారు. వారి తీరుపట్ల ఆయనకు ఆగ్రహం కలిగింది. విధులు నిర్వర్తించాల్సిన విధానం, ప్రజలతో మసలుకోవాల్సిన విధానం గురించి ఆయన వారికి ఇంగ్లిష్ లో క్లాస్ పీకారు. దీంతో వారు ఆయనను పిచ్చోడిని చూసినట్టు చూశారు. దీంతో అసలు తానెవరు? తన పేరేంటి? తాను ఏం చేసేవారు? ఓ సారి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి తెలుసుకోండి అంటూ ఆయన తన గురించిన వివరాలు వెల్లడించారు. దీంతో ఆ అధికారులు ఆయన గురించి వెతికి షాక్ తిన్నారు. దీంతో ఆయన గురించిన వివరాలు స్థానికులకు తెలిశాయి. గత 30 ఏళ్లుగా డొక్కు సైకిల్ పై తిరుగుతున్న వ్యక్తి వెనుక అంత పెద్ద కథ ఉందా? అని అక్కడి గిరిజనులంతా ఆశ్చర్యపోతున్నారు. ఆయనే అలోక్‌ పాల్‌! 1973లో ఢిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లో మాస్టర్‌స్ డిగ్రీ అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్‌ గా పనిచేసి, ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కూడా ఆయన శిష్యుడే. అన్ని సౌకర్యాలు ఉన్నా ఏదో వెలితి, జీవితం అంటే ఇదేనా? అన్న అలోచన, మనవల్ల ఎవరికి ప్రయోజనం, మనం సాధించింది ఏమిటి? అని తనలో తానే ఆలోచనలో మునిగిన ఆయన, ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీలోని మారుమూల గిరిజన ప్రాంతమైన కొచాము చేరుకుని, అక్కడ ఓ చిన్న పాక వేసుకుని జీవిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కరే 50 వేల మొక్కలు నాటారు. ఆ డొక్కు సైకిల్ పై చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ రైతులకు విత్తనాలు సేకరిస్తూ, మారుమూల గ్రామాల ప్రజలకు అందిస్తూ ఉంటారు. అన్ని సౌకర్యాలు వదిలి, ఇలాంటి జీవనం ఎందుకు? అని ఆయనను అడిగితే... సౌకర్యాల మోజులో తోటి వారికి సాయం చేయడం మరచి, తమ డిగ్రీలు, ఆర్థిక బలం చూపించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, జీవితం అంటే తోటి వారికి సాయం చేయడమని, దేశ భక్తి అంటే సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు సాయం చేయడమని ఆయన సమాధానమిస్తున్నారు. ఇవన్నీ తెలసుకున్న యువత సోషల్ మీడియాలో ఆయనను సెలబ్రిటీని చేసింది.

  • Loading...

More Telugu News