: ఉత్తర కొరియాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్...దక్షిణ కొరియా గగనతలంలో సూపర్ సోనిక్ బాంబర్ చక్కర్లు
ఉత్తరకొరియా నిర్వహిస్తున్న అణుపరీక్షలపై అమెరికా గరంగరంగా ఉంది. దక్షిణ కొరియాను రెచ్చగొడుతూ ప్రపంచ దేశాలకు సవాలు విసురుతున్న ఉత్తరకొరియా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా చైనా సహా యావత్ అంతర్జాతీయ సమాజం ఏకమైందని పేర్కొంది. అంతర్జాతీయ నిబంధనలు, తీర్మానాలను బేఖాతరు చేస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశముందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోస్ ఎర్నెస్ట్ తెలిపారు. అంతటితో ఆగని అమెరికా మిత్రదేశమైన దక్షిణ కొరియా గగనతలంపై అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సూపర్ సోనిక్ బాంబర్ యుద్ధవిమానాలను తిప్పింది. దక్షిణ కొరియా జెట్ ఎస్కార్ట్ విమానాల మధ్య బీ-బీ1 బాంబర్ యుద్ధ విమానం ఒసాన్ ఎయిర్ బేస్ పై చక్కర్లు కొట్టింది. ఈ వైమానిక స్థావరం ఉత్తర కొరియాకు 120 కిలోమీటర్ల దూరంలో ఉండడం విశేషం.