: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ను పదవి నుంచి తొలగించిన రాష్ట్రపతి
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్ కోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. మేఘాలయ గవర్నర్ షణ్ముగనాథన్ కు ఆ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ కోవాను రాజీనామా చేయాల్సిందిగా ఇటీవల కేంద్రం కోరింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని చెప్పిన ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించాలని, అప్పటివరకు రాజీనామా చేేసే ప్రసక్తే లేదని రాజ్ కోవా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి.