: మరో కీలక అడుగు... జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుకు నోటిఫికేషన్


భారత పన్ను విధానంలో కీలక సంస్కరణగా, సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు స్వాగతించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లు అమలు దిశగా మరో కీలక అడుగు పడింది. ఈ బిల్లుకు గత వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో, నేడు సమావేశమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ, జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కౌన్సిల్ ఏర్పాటు అపాయింట్ తేదీని సెప్టెంబర్ 12, 2016గా కేంద్రం నిర్ణయించిందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిబంధనల మేరకు ఈ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 60 రోజుల్లోగా కౌన్సిల్ ఏర్పాటు కావాల్సివుంది. ఈ కౌన్సిల్ కు ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోనుంది. ఇప్పటికే 20 రాష్ట్రాల అసెంబ్లీలు జీఎస్టీ బిల్లుపై చర్చించి ఆమోదించిన సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బిల్లును అమలు చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది.

  • Loading...

More Telugu News