: చెన్నైలో కన్నడ వాసి హోటల్ పై పెట్రోల్ బాంబులతో దాడి
కావేరీ నీటి విడుదల విషయంలో కన్నడనాట జరుగుతున్న ప్రజాందోళనపై భగ్గుమంటున్న తమిళ ప్రజలు తమ కోపాగ్నిని తీర్చుకునేందుకు హింస బాట పడుతున్నారు. చెన్నైలోని కన్నడిగుల ఆస్తులపై దాడులకు దిగారు. డాక్టర్ రాధాకృష్ణన్ సాలై ప్రాంతంలో ఓ కన్నడ వ్యాపారి నడుపుతున్న న్యూ ఉడ్ ల్యాండ్ హోటల్ పై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు బాంబులతో దాడి చేశారు. మూడు ఆటోల్లో వచ్చిన దాదాపు 15 మంది హోటల్ అద్దాలను, ఐస్ క్రీం పార్లర్ ను, ఆఫీస్ రూంను ధ్వంసం చేశారు. పెట్రోలుతో సీసాలను నింపుకు వచ్చి వాటిని అంటించి విసిరేశారు. కర్ణాటకలో ఓ తమిళ యువకుడిని వీధుల్లో తీవ్రంగా కొట్టిన నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. కర్ణాటకకు, కన్నడిగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోటల్ గోడలపై "కర్ణాటకలో తమిళులపై దాడులు చేస్తే, తమిళనాడులో కన్నడవాసుల ప్రాంతాలపై మేమూ దాడులు చేస్తాం. ఇక్కడ కన్నడ ప్రజలు ఉన్నారు. జాగ్రత్త" అని రాసి నిరసనకారులు వెళ్లిపోయారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఎవరూ ప్రకటించుకోనప్పటికీ, టీపీడీకే (తాన్ తాయ్ పెరియార్ డ్రావిడర్ కళగం) కార్యకర్తలు ఇందుకు బాధ్యులని, వీరంతా రాయపేట నుంచి వచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీరు వచ్చిన ఆటోలు ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్ లు పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించే ప్రయత్నం జరుగుతోందని రాష్ట్ర డీజీపీ టీకే రాజేంద్రన్ తెలిపారు.