: ఒకప్పుడు ఆయన మెకానిక్.. ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాలో 22 ఫ్లాట్లకు యజమాని!
మొత్తం 900 ఫ్లాట్లు కలిగిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఒకప్పటి మెకానిక్, ప్రస్తుత వ్యాపారవేత్త జార్జ్ వి నేరీపరంబిల్ 22 ఫ్లాట్లను సొంతం చేసుకున్నారు. తాను 22 ఫ్లాట్లతో ఆపనని, మంచి డీల్ కుదిరితే మరిన్ని కొనుగోలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను కలలు కనడం ఆపను. మంచి డీల్ కుదిరితే మరిన్ని ఫ్లాట్లు కొనుగోలు చేస్తా’’ అని జార్జ్ పేర్కొన్నారు. కేరళకు చెందిన జార్జ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు సొంతం చేసుకోవడం వెనక పట్టుదల ఉంది. అంతకుమించిన అవమానం ఉంది. ‘‘ఓసారి నా బంధువు ఒకాయన బుర్జ్ ఖలీఫాను చూపించి.. దీనిని చూడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఇందులోకి ప్రవేశించగలవా?’’ అని ప్రశ్నించాడు. అదే నాలో పట్టుదల పెంచింది. 2010లో బుర్జ్ ఖలీఫాలోని ఓ ఫ్లాట్ అద్దెకు ఉన్నట్టు పేపర్లో ప్రకటన వచ్చింది. దీంతో అదే రోజు అక్కడికి చేరుకున్నా. ఆ తర్వాతి రోజు నుంచీ అక్కడే ఉంటున్నా’’ అని జార్జ్ వివరించారు. ఆరేళ్ల కాలంలో మొత్తం 22 ఫ్లాట్లను కొనుగోలు చేసిన ఈయన, వాటిలో ఐదింటిని అద్దెకు ఇచ్చేశాడు. మిగతా వాటిని కూడా ఇవ్వడానికి మంచి వ్యక్తుల కోసం చూస్తున్నాడట. వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దుబాయ్‌లో ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం బాగుంటుందని భావించి 1976లో ఎడారి దేశంలో జార్జ్ అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఇప్పుడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు అధినేత.