: బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచిన మరో 'వనీ'.. సైన్యంలో చేరిక!
బుర్హాన్ వనీ.. ఈ పేరును ఇప్పట్లో ఎవరూ మరిచిపోరంటే అతిశయోక్తి కాదేమో. రెండు నెలల క్రితం సైన్యం ఎన్కౌంటర్లో ఈ ఉగ్రవాది మృతి చెందిన తర్వాత నుంచి కశ్మీర్లో అల్లర్లు పెచ్చుమీరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వనీ సైన్యంలో చేరాడు. వనీ.. అంటే ఉగ్రవాది బుర్హాన్ వనీ కాదు.. కశ్మీర్ యువకుడు నబీల్ అహ్మద్ వనీ(26). బీఎస్ఎఫ్ నిర్వహించిన అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచి కశ్మీరీలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాడు. త్వరలో అసిస్టెంట్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న వనీ ఆదివారం ఢిల్లీలో హోంమంత్రి రాజనాథ్‌ను కలిశారు. వనీ సైన్యంలో చేరడంపై ఆమె తల్లి హనీఫా బేగం మాట్లాడుతూ తన కొడుకు కలలు నిజమయ్యాయని పేర్కొన్నారు. కష్టపడేతత్వం, అంకితభావమే అతడి విజయానికి కారణమని పేర్కొన్నారు. దేశానికి వనీ పేరు ప్రఖ్యాతులు తెస్తాడన్నారు. మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ వనీ విజయం కశ్మీరీ యువతకు స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో బీటెక్ పూర్తిచేసిన వనీ ప్రస్తుతం కాంట్రాక్ట్ జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ‘‘బీఎస్ఎఫ్లో చేరాలనే నా కల నిజమైంది. ఎన్నో పరీక్షలు రాశాను. చివరికి అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచా’’ అని పేర్కొన్నాడు. జమ్ముకశ్మీర్ యువతకు నిరుద్యోగమే పెద్ద సమస్యని, విద్య మాత్రమే దానిని పరిష్కరించగలదని పేర్కొన్నాడు. రాళ్లు పట్టుకోవడం ద్వారా దానిని సాధించలేమని వివరించాడు.