: విభజన బిల్లుకు మేము అడ్డుపడతామని సోనియాగాంధీ నాడు భయపడింది: వెంకయ్యనాయుడు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజ్ ప్రకటించడంపై రాజకీయ పార్టీలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన విషయాలను ప్రస్తావించారు. విభజన సమయంలో బిల్లుకు అడ్డుపడతానేమోనని భయపడి సోనియా తన దగ్గరకు తమ నేతలను పంపించారని అన్నారు. విభజన సమయంలో ఏపీికి అన్యాయం జరుగుతుందని తనకు అనిపించిందని, అందుకే, అందరితో నాడు మాట్లాడానని అన్నారు. బిల్లుకు అడ్డుపడతానని భావించిన సోనియా... జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ను తన దగ్గరకు పంపారన్నారు. హైదరాబాద్ లోని ఒక మిత్రుడి ఇంట్లో తాము భేటీ అయ్యామన్నారు. ‘బిల్లును తీసుకువస్తే సమర్థిస్తారా?’ అని వారు తనను ప్రశ్నించగా, సమర్థిస్తానని చెప్పానన్నారు. బిల్లులోని అంశాలన్నీ వారు చెప్పారని, అయితే, అవి అంత సంతృప్తికరంగా లేకపోవడంతో భేటీ ముగించేశామంటూ వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.