: భారీ వర్షంతో కరీంనగర్ అతలాకుతలం... కుప్పకూలిన బాలాజీనగర్ బ్రిడ్జి
గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి కరీంనగర్ అతలాకుతలమైంది. వాగులు, కాలువలు పొంగి ప్రవహిస్తుండగా, ఇక్కడి బాలాజీనగర్ లోని మెయిన్ డ్రైనేజి కాలువపై ఉన్న బ్రిడ్జి వరద ప్రవాహానికి కుప్పకూలింది. దీంతో పట్టణంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు నిలిచాయి. ఒక్కసారిగా ముంచుకు వచ్చిన నీటి కారణంగానే వంతెన కుప్పకూలినట్టు తెలుస్తోంది. కాగా, కరీంనగర్ తో పాటు నిజామాబాద్ జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారే అవకాశాలు ఉండటంతో, ఏపీ, తెలంగాణల్లో మరిన్ని రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.