: ఏం చేశానని నాకు ‘డాక్టర్ టెర్రర్’ అనే ట్యాగ్‌లైన్ తగిలించారు?: జకీర్ నాయక్ ఆక్రోశం
వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్ నాయక్ తనపై వస్తున్న ఆరోపణలపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని తనకు ‘డాక్టర్ టెర్రర్’ అనే ముద్రవేశారని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు నాలుగు పేజీల బహిరంగ లేఖను శనివారం విడుదల చేశారు. కొన్ని నెలలుగా విదేశాల్లో ఉంటున్న ఆయన తనపై వస్తున్న ఆరోపణలపై ప్రశ్నలు సంధించారు. తన పేరుకు ముందు ‘డాక్టర్ టెర్రర్’, ‘టెర్రర్ ప్రీచర్’ అనే ట్యాగ్లైన్లు ఎందుకు తగిలిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనను 150 దేశాలు గౌరవిస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా బోధనలు చేస్తున్న తాను 25 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్నానని జకీర్ పేర్కొన్నారు. తనను సొంత దేశమే ఉగ్రవాదులను ప్రభావితం చేస్తున్న వ్యక్తిగా ముద్రవేయడం బాధాకరంగా ఉందన్నారు. ఆ ట్యాగ్ లైన్లు తనను ఎంతగానో బాధిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై చేస్తున్న దర్యాప్తులో ఇప్పటి వరకు తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోయారని అన్నారు. తన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్) రిజిస్ట్రేషన్‌ను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇది తన ఒక్కడిపై జరుగుతున్న దాడి కాదని మొత్తం భారతీయ ముస్లింలపై జరుగుతున్న దాడి అని ఆరోపించారు. ఐఆర్ఎఫ్ మతమార్పిడులను ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు సరికాదని అన్నారు. కాగా జూలై 1న ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పట్టుబడిన ఓ ఉగ్రవాది.. జకీర్ నాయక్ ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందినట్టు చెప్పడంతో జకీర్ నాయక్ వ్యవహారం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.