: ఉత్తర కొరియాలో అంతే! నేరానికి పాల్పడితే మూడు తరాలకూ శిక్ష విధించేస్తారు!
సాధారణంగా తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులను వారసులు ఎంచక్కా అనుభవిస్తుండడం చూస్తూనే ఉంటాం. అయితే, ఉత్తరకొరియాలో ఎవరయినా వ్యక్తులు గవర్నమెంటుకి వ్యతిరేకంగా చర్యలు సాగించినా, తీవ్రమైన నేరాలు చేసినా ఆ వ్యక్తులకు సంబంధించిన మూడు తరాలవారికి శిక్ష పడుతుంది. ఆ దేశంలో ఉన్న చట్టం ప్రకారం ‘మూడు తరాల శిక్ష’ను నేరాలకు పాల్పడిన వ్యక్తుల తల్లిదండ్రులు, వారసులూ అనుభవించాల్సిందే. నేరాలకు పాల్పడిన వ్యక్తికి అతడితో పాటు అతని తల్లిదండ్రులకి, భార్యకి, దోషికి తల్లిదండ్రులు లేకపోతే వారి పిల్లలకి, మనవళ్లకి శిక్షను అమలు చేస్తున్నారు. ఇలా మూడు తరాల వారు ఒక్కరు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. ఈ మూడు తరాల శిక్షను అమలు చేసేందుకు ఓ జైలు లాంటి క్యాంపు ఉంటుంది. అందులో మహిళలకు, పురుషులకు, పిల్లలకు వేర్వేరు రూమ్స్ ఉంటాయి. వారికి శిక్షగా ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి అర్ధరాత్రి వరకు గనుల్లో, పలు కర్మాగారాల్లో పనులు చేయిస్తారు. పని చేసే క్రమంలో దోషులు ఏదైనా తప్పులు చేస్తే వారి పట్ల మరింత కఠినంగా చర్యలు తీసుకొంటారు. చిత్రహింసలకు గురిచేస్తారు. అధికారులు వారికి విధించిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ, వారు పెట్టే హింసను అనుభవిస్తూ నేరానికి పాల్పడిన కుటుంబం జీవితాంతం జైలులోనే ఉంటుంది. ఈ క్యాంపులోనే పుట్టిపెరిగిన షిన్ డంగ్ హ్యుక్ అనే వ్యక్తి 20 ఏళ్ల వయస్సులో అందులో నుంచి పారిపోయాడు. అనంతరం తాను ఇరవై ఏళ్లు క్యాంపులో అనుభవించిన శిక్షను, అనుభవాలను వివరిస్తూ ఆయన ఆత్మకథ రాశాడు. దానికి ‘ఎస్కేప్ ఫ్రమ్ క్యాంప్ 14’ అనే పేరు పెట్టాడు.