: నన్ను అన్నారు కదా... మరి, పవన్ కల్యాణ్‌ని 'నాలుక కోస్తా'మని ఎందుకు అనలేదు?: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం విజయవాడలో నిర్వహిస్తోన్న బంద్‌లో ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోదా కోసం తాను మాట్లాడితే ఓ ఎంపీ తనను నాలుక కోస్తానని హెచ్చరించారని అన్నారు. మరి జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ కూడా హోదా కోసం గళమెత్తితే ఆయనను నాలుక కోస్తా అని ఎందుకు అనలేదని శివాజీ ప్రశ్నించారు. అభిమానులు, ప్రజలు తిరగబడతారని భయపడుతున్నారా? అని దుయ్యబట్టారు. మనిషిని బట్టి ఎంపీలు ఆచితూచి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎంతకాలం ప్రజలని మోసం చేస్తారని శివాజీ ప్రశ్నించారు. మనం ఎందుకు భయపడాలి? అని అడిగారు. పవన్ కల్యాణ్ అనే వ్యక్తికి హోదా తీసుకొచ్చే సత్తా ఉందని ఆయన అన్నారు. ప్రజలు నమ్మిన వ్యక్తి పవన్ అని ఆయన అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు ప్రజలు మద్దతుగా నిలుస్తారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయంటున్నారు.. ఏవేవో మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అప్పుడపప్పుడు కేంద్రం బిక్షమేస్తోందని శివాజీ అన్నారు. ఇచ్చింది తీసుకోవాలనే ధోరణి వద్దని సూచించారు. తనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని, ఆంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ జనసేన పెట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టుకున్నారు. అలాగే శివాజీ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనపై విమర్శలు గుప్పించమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యమేనని అన్నారు. ప్రజలను ప్రభుత్వ నేతలు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పోలవరం అంటూ తృప్తి పడుతున్నారు.. పోలవరం అంత ఈజీగా పూర్తవుతుందా? అని శివాజీ ప్రశ్నించారు. భూసేకరణ ఇంకా జరగాల్సి ఉంది. పోలవరానికి పలు లీగల్ పాయింట్లు అడ్డుతగులుతున్నాయి. చట్ట సవరణకు ఎంత సమయం పడుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని అన్నారు. దాని కోసం అందరూ కలిసి పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. తాము పోరాటాన్ని ఆపబోమని, రాజకీయాలు చేయడం లేదని పేర్కొన్నారు.