: తిరుచానూరు పీఎస్ ను ముట్టడించిన వైసీపీ!... భూమనను విడుదల చేయాలని డిమాండ్!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా నేటి ఉదయం ప్రారంభమైన రాష్ట్ర బంద్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బంద్ లో భాగంగా తెల్లవారుజాముననే రోడ్డెక్కేందుకు సిద్ధమైన వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన ఇంటి వద్దే అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిరసనకు దిగకముందే తమ నేతను అరెస్ట్ చేసిన పోలీసుల తీరుపై భూమన అభిమానులు భగ్గుమన్నారు. ఈ క్రమంలో భారీగా పోగైన వైసీపీ శ్రేణులు తిరుచానూరు పీఎస్ ను చుట్టుముట్టాయి. భూమనను తక్షణమే విడుదల చేయాలని వారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.