: భారీ నష్టాల్లోకి జారిపోయిన భారత స్టాక్ మార్కెట్
ఆసియా మార్కెట్ల నుంచి అందిన సంకేతాలు బలహీనంగా ఉండటంతో పాటు, యూరప్ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలహీనపరిచిన వేళ, భారీ నష్టాల దిశగా భారత స్టాక్ మార్కెట్ సాగింది. సెషన్ ఆరంభంలోనే 100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, ఆపై మరే దశలోనూ కోలుకోలేకపోయింది. చివరి గంట వ్యవధిలో కొంత కొనుగోలు మద్దతు కనిపించినా, అది నిలవలేదు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 248.03 పాయింట్లు పడిపోయి 0.85 శాతం నష్టంతో 28,797.25 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 85.80 పాయింట్లు పడిపోయి 0.96 శాతం నష్టంతో 8,866.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.99 శాతం, స్మాల్ కాప్ 0.47 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, గెయిల్, టీసీఎస్, విప్రో, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, హిందాల్కో, యస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, యాక్సిస్ బ్యాంక్, హీరోమోటో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,950 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,148 కంపెనీలు లాభాలను, 1,609 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 1,12,16,034 కోట్లుగా నమోదైంది.