: పవన్ ను బీజేపీ నడిపిస్తోందా? పవన్ వెనుక టీడీపీ ఉందా?... ఇలాంటివన్నీ పిచ్చికూతలే!: పవన్ కల్యాణ్
తనకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరని, ప్రజా సమస్యలే తన గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చిన జనసేన అధినేత, తన వెనుక ఎవరూ లేరని, సమస్యలపై పోరాటం తన నైజమని చెప్పారు. "నా వెనక ఎవరు ఉన్నారని, బీజేపీ నడిపిస్తోందా? టీడీపీ వెనకుందా? అని ప్రశ్నలు వస్తున్నాయి. నా వెనకున్నది మీరే. మీరే నా వెనకున్నది. ప్రతి ఒక్కరూ పిచ్చి కూతలు కూస్తే... రేయ్... నన్ను ఒకరు నడిపించాలా? ఏం మాకు పౌరుషం లేదా? నాకు ఆత్మ గౌరవం లేదా? ఏమనుకుంటున్నారు మీరు? మమ్మల్ని ఇంకొకరు నడిపించాలా? చెప్పండి మీరందరూ..." అంటూ తీవ్ర స్వరంతో పవన్ ప్రశ్నలు కురిపించారు. "మనం ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ వంటి పదాలు మన డిక్షనరీలోకి కొత్తగా వచ్చాయి. వీటిని మాట్లాడేముందు మన పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉమ్మడి రాష్ట్రంలో మనకు సరైన న్యాయం జరగకపోతే, అమరజీవి పొట్టి శ్రీరాములు 50 రోజులకు పైగా నిరాహారదీక్ష చేసి మనం సంపాదించుకున్న రాష్ట్రం ఇది. ఆ రోజున తెలంగాణ లేదు ఆంధ్రప్రదేశ్ లో. కానీ, ఒకవైపు ఇక్కడ స్వాతంత్ర్య సమరం వేడుకలు జరుగుతూ ఉంటే... ఇక్కడ మనం తెలంగాణ గురించి తెలుసుకోవాలి. వాళ్లు మన సోదరులు, అన్నదమ్ములు. వాళ్లూ మన ఆడపడుచులు, బిడ్డలు. తెలంగాణలో అప్పుడు నిజాం నిరంకుశ పాలన సాగింది. రజాకార్లు దోపిడీలు చేశారు. మానభంగాలు చేశారు. తెలుగుభాషను నేర్చుకోనివ్వకుండా చేశారు. ఆ సమయంలోనే తెలంగాణ ప్రజలు వెనుకబడ్డారు. ఆ సమయంలో అన్నదమ్ముల్లా ఉంటారని ఆంధ్రాలో తెలంగాణను కలిపారు. ఆపై రెండు దశాబ్దాల తరువాత, ఏదైతే విధివిధానాలతో కలిసుండాలని అనుకున్నారో... అది చేయకపోయేసరికి జై తెలంగాణ ఉద్యమం మొదలైంది. దాన్ని కేంద్రం సమాధాన పరిచింది" అంటూ గత చరిత్రను చెప్పుకొచ్చారు. ఆపై సమస్య మరింతగా పెరిగిందని, రాష్ట్రం విడిపోతే తమ ఉద్యోగాలు తమకే దక్కుతాయన్న భావనతో తెలంగాణ నేతలు, యువత ఉద్యమించారని గుర్తు చేశారు. అ సమయంలోనే జరిగిన నేటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. తెలంగాణలో ఉద్యమించి ప్రాణత్యాగాలు చేసిన వారికి ఆనాటి ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంట్ సాక్షిగా క్షమాపణలు చెప్పి, రాష్ట్రాలను విడగొట్టేది లేదని స్పష్టం చేశారు. కానీ, అదే 150 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, అదే విధానాన్ని ఎందుకు కాపాడుకోలేకపోయిందని ప్రశ్నించారు? అవకాశవాదపు రాజకీయాలు కాంగ్రెస్ చేయడం వల్ల సీమాంధ్ర ప్రాంత యువకులకు ఇబ్బందులు వచ్చాయని పవన్ దుయ్యబట్టారు.