: ఆర్థిక సంఘం ఒప్పుకోలేదా..? ఇంతకన్నా బూతు మాట మరొకటి లేదు: ఉండవల్లి ఫైర్
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ప్రత్యేక హోదాను ఇచ్చితీరాల్సిందేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. ఈరోజు హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... తెలుగు ప్రజలను కేంద్రం మరోసారి వంచనకు గురిచేసిందని వ్యాఖ్యానించారు. ఏపీకి హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం ఒప్పుకోవట్లేదా..? ఇంతకన్నా బూతు మాట మరొకటి లేదని ఆయన మండిపడ్డారు. ఒక అసత్యాన్నే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏపీకి హోదాని వ్యతిరేకించలేదని ఆయన పేర్కొన్నారు. వెంకయ్య ఆనాడు రాజ్యసభలో చెప్పిన మాటలేమయ్యాయని ఉండవల్లి ప్రశ్నించారు. ‘ఏపీకి ప్రత్యేకహోదా కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా ఒప్పుకుంది. ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం కూడా వ్యతిరేకించలేదు. కేంద్రం ఎందుకిలా ప్రవర్తిస్తోంది. చట్టసవరణ చేసయినా హోదా ఇవ్వాల్సిందే. కేంద్రం కనీసం లోటు బడ్జెట్టును కూడా పూడ్చే పరిస్థితిలో కూడా లేదు. ఏం మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఆనందపడతారో ఆ మాటలు కేంద్రం మాట్లాడుతోంది. దేశంలో అసలు ఆంధ్రప్రదేశ్ హోదా ఏమిటి?.. ఏపీకి నమ్మక ద్రోహం చేశారు. మొన్న రాత్రి 11 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి ఏపీకి హోదాపై పాడినపాటే పాడారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.