: అసెంబ్లీలో ఉన్మాదుల్లా ప్రవర్తించారు: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. హోదాపై అవసరమైతే రాత్రి 2 గంటల వరకు చర్చిద్దాం.. కానీ ఇటువంటి దౌర్జన్యాలకు దిగవద్దని సూచించారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు శాసనసభను వారు చెప్పినట్లుగా జరగాలని ఉన్మాదుల్లా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. నిన్న జరిగిన పరిణామాలపై ధైర్యంగా శాసనసభలో ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారని, ఎన్ని గంటలయినా మాట్లాడతామన్నారని అయినా వైసీపీ నేతలు గందరగోళం సృష్టించారని ఆయన అన్నారు. సభలో వైసీపీ నేతలని సూచనలు ఇవ్వమని కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అయినా వైసీపీ ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే వైసీపీ నేతలు సంతోషపడతారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభా మర్యాదను వైసీపీ మంటగలుపుతోందని విమర్శించారు. అతి కిరాతకంగా ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రవర్తించారని అన్నారు. వైసీపీ నేతలు ఓవైపు గందరగోళం సృష్టిస్తున్నారు.. మరోవైపు సభలో సమస్యలు చర్చించడం లేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.