: ఆంధ్రులంతా చంద్రబాబుకి మద్దతుగా ఉండాలి: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై శాసనసభలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు గందరగోళం సృష్టించడం పట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాబీ వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వాతావరణం ఉండకూడదనే సీఎం చంద్రబాబు ఉద్దేశమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాబోయే మూడేళ్లు ఎంతో ముఖ్యమైన కాలమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రాదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అనవసర గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే నిర్ణయాలు తీసుకుంటారని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఆంధ్రులంతా చంద్రబాబుకి మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రకటించిన సాయంలో రాయలసీమ సహా వెనుకబడిన జిల్లాలకు 1500 కోట్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.