: రౌడీ రాజకీయాలను అసెంబ్లీలోకి తీసుకొచ్చారు.. వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారు: మంత్రి పీతల సుజాత
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు రౌడీ రాజకీయాలను అసెంబ్లీలోకి తీసుకొచ్చారని ఏపీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో వైసీపీ నేతలు పేపర్లు చించి స్పీకర్‌పై విసరడంతో సభ మళ్లీ వాయిదా పడిన నేపథ్యంలో అసెంబ్లీ లాబీ వద్ద పీతల సుజాత మాట్లాడుతూ... రౌడీ రాజకీయాలు అసెంబ్లీలోకి వస్తే ఎలా ఉంటాయో ఈరోజు చూశామని అన్నారు. ఓవైపు ప్రత్యేక హోదాకు పట్టుబడుతున్నారు... మరోవైపు ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు రెడీ అని చెబుతోంటే గొడవ చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని పీతల సుజాత అన్నారు. రాష్ట్రం నష్టపోవడానికి కారణం వారేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి జరిగితే వారికి పుట్టగతులు ఉండబోవనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. సభలో ప్రతిపక్ష సభ్యుల తీరు అవమానకరమని పేర్కొన్నారు. సభలో వైసీపీ నేతలు ఫ్యాక్షనిస్టులు, రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. వైసీపీకి ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. సభాపతి వద్దకు వెళ్లి మైకులాగడం, కాగితాలు చించి వేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.