: తెలంగాణ విషయంలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదు: జానారెడ్డి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఎంతమాత్రమూ లేదని, అలాగే ఇప్పుడు అభివృద్ధి విషయంలోనూ ఆయన చేస్తున్నది శూన్యమని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 'రైతుల రణభేరి'లో ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం నడుస్తున్న సమయంలో రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆయా కుటుంబాలను ఆదుకున్నామని, ఇప్పుడు మాత్రం మాటలు చెబుతున్నారే తప్ప చేతలు లేవని అన్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు తాము రూ. 1.5 లక్షల పరిహారం వెంటనే ఇచ్చామని, ఇప్పుడు రూ. 6 లక్షలు ఇస్తామంటున్న కేసీఆర్ సర్కారు, ఒక్క రైతు కుటుంబానికి కూడా ఆ డబ్బు ఇవ్వలేదని ఆగ్రహంతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను కూడా ఆయన నెరవేర్చుకోవడం లేదని, రైతు రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు.