: తన సమాధిని తానే నిర్మించుకున్న మధురై మహిళ.. చూసేందుకు పోటెత్తుతున్న గ్రామస్తులు


ఆమెది పెద్ద కుటుంబమే. అయితే ఇప్పుడు మాత్రం ఒంటరి. నా అన్నవారు ఎవరూ లేరు. మరి తాను చనిపోతే అంతిమ సంస్కారాలు చేసేది ఎవరు? సరిగ్గా ఈ ఆలోచనే ఆమెతో సమాధిని నిర్మించేలా చేసింది. తాను చనిపోయాక ఎవరికీ భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె చెబుతోంది. ఇప్పుడీ సమాధి సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిపోయింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల వారు తరలివస్తున్నారు. తమిళనాడులోని సూలల్ పంచాయతీ పరిధిలోని పల్లకుజి మెలవిల్లైకు చెందిన రోజీ(55) ఆమె తల్లిదండ్రులకు ఆరో సంతానం. ఓ సోదరుడు కూడా ఉన్నాడు. వారందరికీ పెళ్లిళ్లయిపోయాయి. రోజీ మాత్రం వివాహం కాకుండా ఒంటరిగా ఉండిపోయింది. స్థానికంగా జీడి తోటల్లో పనిచేస్తూ జీవిస్తోంది. వచ్చిన సంపాదనలో కొంత పొదుపు చేసి ఏడు సెంట్లలో ఓ గది నిర్మించుకుని అందులో ఉంటోంది. ‘‘నీకంటూ ఎవరూ లేరు. ఎందుకంతలా కష్టపడతావు. నీవు చనిపోయాక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కూడా ఎవరూ లేరు కదా’’ అని ఇరుగుపొరుగువారు రోజీని ప్రశ్నించడంతో నిజమే అనుకున్న ఆమె వెంటనే పనిమానేసి కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ(ఎంఎన్ఆర్ఈజీఎస్)లో చేరింది. ఆ తర్వాత తాను పొదుపు చేసిన డబ్బులోంచి రూ.50వేలు తీసి సమాధిని నిర్మించాలనుకుంది. నెల రోజుల క్రితం సమాధి నిర్మాణ పనులు చేపట్టింది. గ్రానైట్ రాళ్లతో అందంగా సమాధిని నిర్మించుకుంది. అంతేకాదు తన ఫొటో, పేరు, వివరాలతో ఓ ఫలకాన్ని కూడా సమాధి పైభాగంలో సిలువ కింద అమర్చింది. తాను చనిపోయాక ఇందులో సమాధి చేయడం చాలా సులభమైన పని అని, తలవైపు ప్రాంతంలో చిన్న గొయ్యి తవ్వడం ద్వారా మృతదేహాన్ని సులభంగా అందులోకి చేర్చవచ్చని రోజీ చెబుతోంది. సమాధి విషయం కాస్తా తెలియడంతో స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తున్నారు.

  • Loading...

More Telugu News