: జనాలకు చుక్కలు చూపించిన సర్కస్ ఏనుగు... 3 గంటల పాటు హల్చల్ చేసిన గజరాజు
సర్కస్‌లో విన్యాసాలు చేయడానికి తీసుకొచ్చిన ఓ ఏనుగు జనాలకు చుక్కలు చూపించిన ఘటన మహారాష్ట్రలోని పుణె భోసారి ప్రాంతంలో చోటుచేసుకుంది. దాదాపు మూడు గంటలపాటు ఇది హల్చల్ చేసింది. సర్కస్ సిబ్బంది ఏనుగుతో విన్యాసం చేయించడానికి ఓ ఏనుగును తీసుకొచ్చారు. అయితే సర్కస్‌ను చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చిన జనాలు గూమిగూడి ఉండడాన్ని చూసిన ఏనుగు భయపడిపోయి, జనాలపైకి వచ్చింది. మూడు గంటలు అటూ ఇటూ తిరుగుతూ హల్చల్ చేసింది. దీంతో జనాలు కూడా భయపడిపోయారు. ఏనుగును కట్టడి చేయడానికి సర్కస్ నిర్వాహకులు, అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు, వెటర్నరీ డాక్టర్ అందరూ కలిశారు. మూడు గంటలు శ్రమించి ఏనుగుని అదుపులోకి తీసుకొచ్చారు. గజరాజుని తాము ఓ బురదగుంటలో కూర్చునేలా చేసినట్లు డాక్టర్ తెలిపారు. ఆ తరువాత దానిపై నీళ్లు కొట్టి స్నానం చేయించినట్లు పేర్కొన్నారు. అనంతరం ఏనుగుకి గడ్డి పెట్టినట్లు, దాంతో అది నెమ్మదించినట్లు తెలిపారు. ఏనుగు జనంవైపు వెళ్లినా దాడి చేయలేదని పోలీసులు తెలిపారు. జనానికి ఎటువంటి హానీ జరగలేదని చెప్పారు.