: అమితాబ్ తో కలసి మళ్లీ తాను నటించకపోవడానికి కారణం చెప్పిన రేఖ!
బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్, అందాల తార రేఖ ఒకప్పటి హిట్ పెయిర్. సిల్ సిలా, రామ్ బలరామ్, సుహాగ్, మిస్టర్ నట్వర్ లాల్, గోల్ మాల్, ఖూన్ పాసినా, ఇమ్మాన్ ధరమ్, అలాప్, దో అంజానే, నమక్ హరామ్, గంగా కీ సౌగంథ్ తదితర చిత్రాల్లో అమితాబ్-రేఖ జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాదు, వారి మధ్య ప్రేమాయణం నడుస్తోందనే వార్తలు నాడు హల్ చల్ చేశాయి. 1973లో నటి జయబాధురిని అమితాబ్ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రేఖతో కలిసి పలు చిత్రాల్లో బిగ్ బీ నటించాడు. కానీ, 1978లో విడుదలైన ‘ముకద్దర్ కా సికందర్’ చిత్రం తర్వాత అమితాబ్ సరసన రేఖ నటించలేదు. ఈ హిట్ పెయిర్ ఆ తర్వాత కలిసి నటించకపోవడానికి కారణాలేంటో మొన్నటివరకు తెలియదు. కానీ, ఈ విషయాన్ని స్వయంగా రేఖే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. అమితాబ్ తో కలిసి తాను నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పింది. ముకద్దర్ కా సికందర్ సినిమా ప్రివ్యూ షో చూసేందుకు అప్పుడు వెళ్లానని, అమితాబ్ కూడా తన కుటుంబసభ్యులతో వచ్చారని చెప్పింది. తన ముందు వరుసలో అమితాబ్, జయబాధురి, వారి కుటుంబసభ్యులు కూర్చున్నారని, అమితాబ్ తో తాను సన్నిహితంగా ఉన్న దృశ్యాలను తెరపై చూసిన జయ ఏడవడాన్ని తాను గమనించానని రేఖ చెప్పింది. ఆ తర్వాత అమితాబ్ తనతో కలిసి నటించబోనని నిర్మాతలకు తేల్చి చెప్పాడన్న విషయం ఇతరుల ద్వారా తనకు తెలిసిందని రేఖ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ విషయమై అమితాబ్ ఒక్కసారి కూడా తనతో ప్రస్తావించలేదని, తానే ఓ సారి ప్రశ్నించబోతే, ‘నేను ఏమీ చెప్పలేను. నన్ను ఏమీ అడగొద్దు’ అని అమితాబ్ అన్నారంటూ నాటి విషయాలను రేఖ గుర్తుచేసుకుంది.