: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామన్న ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనమండలిలో హోదాపై ప్రకటన చేస్తోన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విభజన అవమానాలకు గురైన ప్రజల్లో ప్రత్యేక హోదా చుట్టూ బలమైన ఆకాంక్ష నెలకొందని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన హామీల అమలుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ రూపొందించాలని వ్యాఖ్యానించారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామని చంద్రబాబు అన్నారు. వర్షాలు పడని పరిస్థితుల్లో కూడా రైతులకు ఇబ్బందులు కలగకుండా రెయిన్ గన్ లు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాజధాని విషయంలో ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రానికి ఏర్పడే లోటును ఐదు సంవత్సరాలు భరిస్తామని కేంద్రం తెలిపినట్లు చెప్పారు. దుగరాజపట్నం పోర్టును పీపీపీ పద్ధతిలో నెలకొల్పేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించిందని పేర్కొన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీ భవన్‌ను జనాభా దాషామాలో విభజించేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని చంద్రబాబు పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం పోలవరానికి 25వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. పోలవరానికి రాష్ట్రం పెట్టిన ఖర్చును రీయింబర్స్ చేస్తామని కేంద్రం చెప్పినట్లు పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చింది మొత్తం తీసుకుంటామని, రావాల్సింది అడిగి తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.