: అఖిలేష్ నోట రాహుల్ మాట... యూపీ పీఠం కోసం పొత్తు!
వచ్చే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య పరిణామాల దిశగా సాగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ, సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెరలేపాయి. యూపీలో మరోసారి అధికారం కోసం తాపత్రయపడుతున్న సమాజ్ వాదీ పార్టీ, దాదాపు 3 దశాబ్దాల తరువాత తిరిగి అధికారం చేపట్టాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు 2017 ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయన్న వార్తలకు అఖిలేష్ వ్యాఖ్యలు మద్దతిచ్చేలా ఉన్నాయి. రాహుల్ తనకు మంచి మిత్రుడని, ఆయన మంచి మనిషని వెల్లడించిన అఖిలేష్, ఎంత ఎక్కువ సమయం రాహుల్ యూపీలో గడిపితే, తమ స్నేహం అంతగా పెరుగుతుందని అన్నారు. తాము కలుసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. కాగా, గతంలో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య బలమైన స్నేహం కొనసాగిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఆ పార్టీని ములాయం పలుమార్లు వెనకేసుకుని వచ్చి మద్దతిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలు కొత్త పొత్తులకు దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయాన్ని ఆయన్నే అడిగితే, తన వ్యాఖ్యలను మీడియా రాజకీయ కోణంలోనే చూస్తోందని అనేసి నవ్వుతూ వెళ్లిపోయారే తప్ప 'పొత్తుండదు' అని స్పష్టంగా చెప్పకపోవడం గమనార్హం.