: ఆమ్ ఆద్మీకి మరిన్ని ఇబ్బందులు... 52 మంది యువతులను వంచించారని సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు 52 మంది పార్టీ మహిళా కార్యకర్తలను వేధించి తమ లైంగిక అవసరాలను తీర్చుకున్నారని పంజాబ్ స్టేట్ కమిటీ మెంబర్ అమన్ దీప్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలోని పలువురు ప్రముఖ నాయకులు ఈ దురాగతం వెనుక ఉన్నారని, ఢిల్లీకి చెందిన ఆప్ మహిళా కార్యకర్తలకు నరకం చూపారని ఆరోపించారు. మహిళా రక్షణే ప్రధాన నినాదంగా అధికారంలోకి వచ్చిన చీఫ్ మినిస్టర్, మహిళలకు ఇచ్చిన హామీలన్నీ మరచిపోగా, ఆ పార్టీ కార్యాలయాలు మహిళలకు ఎంతమాత్రమూ రక్షణ కల్పించలేకపోగా, వారిని అవసరాలు తీర్చే ఆటబొమ్మలుగా చూశాయని అన్నారు. తాను ఈ విషయాలను పార్టీ సమావేశంలో ప్రస్తావించిన వేళ, తనను దుర్భాషలాడారని, వేధింపులను నివారించాలని తాను కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన తెలిపినా, ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయని అన్నారు. ఈ 52 మందిలో వేధింపులను తట్టుకోలేకపోయిన ఓ యువ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు.