: టీచర్లను వెంటనే రిలీవ్ చేయండి.. ఏపీ, తెలంగాణలను ఆదేశించిన సుప్రీంకోర్టు
మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ప్రత్యేక విధుల్లో భాగంగా పర్సనల్ సెక్రటరీలుగా నియమించిన టీచర్లను వెంటనే రిలీవ్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వెంటనే వారిని ఆ విధుల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా బుధవారం జస్టిస్ దీపక్ మిశ్రా, ఎస్.నాగప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో వారిని ప్రస్తుత పోస్టుల నుంచి రిలీవ్ చేయాలని పేర్కొంది. అలాగే మూడు వారాల్లోగా టీచర్లు తమ విధుల్లో చేరాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. కాగా టీచర్ల డిప్యుటేషన్‌ను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సీనియర్ కౌన్సిల్ విశ్వనాథ్ శెట్టి తెలిపారు. అయితే డిప్యుటేషన్లో కొనసాగుతున్న టీచర్లు తాము 2016-17 విద్యాసంవత్సరం వరకు ప్రస్తుత విధుల్లోనే కొనసాగుతామని దరఖాస్తు చేసుకున్నట్టు ఆయన వివరించారు.