: గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి.. తుంగభద్రలో మునిగి ఏడుగురు మృతి
వేడుకగా సాగిన గణేశ్ నిమజ్జన కార్యక్రమం విషాదంగా ముగిసింది. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నదిలో దిగిన వారిలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గ తాలుకా హదనహల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30-35 మంది యువకులు వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేశుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తుంగభద్ర నది వద్దకు చేరుకుని నదిలో దిగారు. అలా దిగిన వారిలో పలువురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను తెప్పించి గాలించగా ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున నది వద్దకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది.