: చెరిగిపోని స్నేహం!.... ఆసియాన్ సదస్సులో చీర్స్ కొట్టిన మోదీ, ఒబామా!
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆయనకు అమెరికా వీసా తిరస్కరించిన సంగతి విదితమే. అయితే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ రాగా, ఆ మేర మెజారిటీకి కారణమైన మోదీ.. భారత ప్రధాని పీఠం ఎక్కారు. అంతే, ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచింది. మోదీ ఘన విజయాన్ని అమెరికా మీడియా కీర్తించగా... ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆకాశానికెత్తేశారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య బలమైన స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. తరచూ హాట్ లైన్ లో మాట్లాడుకునే ఈ నేతలిద్దరూ... చిరకాల మిత్రులుగా మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఓ ఆసక్తికర సన్నివేశం లావోస్ లో నిన్న ప్రారంభమైన ‘ఆసియాన్’ సదస్సులో కనిపించింది. ఈ సదస్సుకు పలువురు దేశాధినేతలతో పాటు ఒబామా, మోదీలిద్దరూ హాజరు కాగా, వారి మధ్య బ్రూనై సుల్తాన్ హసనల్ బొల్కియ ఆసీనులయ్యారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా తమ మధ్య బొల్కియ ఉన్నప్పటికీ... మోదీ, ఒబామాలిద్దరూ తమ ముందు పెట్టిన డ్రింక్ గ్లాసులను పట్టుకుని లేచి నిలబడి మరీ చీర్స్ కొట్టుకున్నారు. ఈ సన్నివేశం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది.