: ఏపీ భవన్ విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!... 52:48 నిష్పత్తిలోనే వాటాలు!
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఇప్పటికే రెండున్నరేళ్లకు పైగా అయిపోయింది. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రంగా ఉన్న ఏపీ భవన్ విభజనకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఏపీ భవన్ విభజనపై రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలు పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న కేంద్రం... నిన్న ఏపీ భవన్ విభజనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికన 52: 48 దామాషాలో ఏపీ భవన్ ను పంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 49(1) ను ప్రస్తావిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అశుతోశ్ జైన్ రెండు తెలుగు రాష్ట్రాలకు నిన్న వేర్వేరుగా లేఖలు రాశారు.