: వేర్పాటు వాదులకు షాకిచ్చే నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం
జమ్మూకశ్మీర్ లోని వేర్పాటు వాదులపై కఠిన చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. జమ్మూకాశ్మీర్ లో పర్యటించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడ వివిధ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ, వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్పాటు వాదుల హవాకు కాశ్మీర్ లో అడ్డుకట్ట వేయాలంటే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన హోం మంత్రి... త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వేర్పాటు వాదులు జమ్మూకాశ్మీరీల ముసుగులో కొన్ని ప్రభుత్వ సౌకర్యాలు దర్జాగా అనుభవిస్తున్నారు. ముందుగా వాటిని తొలగించాలని భావిస్తోంది. అందులో భాగంగా వారికి కల్పిస్తున్న భద్రతను తొలగించనుంది. అదే సమయంలో వారిపై నిరంతర నిఘాను ఉంచనుంది. అలాగే ప్రముఖుల హోదాలో వారందుకుంటున్న చికిత్సకు కత్తెరవేయనుంది. దీనితోపాటు వివిధ ప్రభుత్వ సౌకర్యాలను నిలిపివేయనుంది. అంతటితో ఆగకుండా వేర్పాటు వాదులు స్వేచ్ఛగా విదేశాలు విహరించడంపై కూడా కఠిన నిబంధనలు అమలు చేయనుంది. దీంతో వారిని దారికి తెచ్చుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.