: మా పనులను వారంతా రహస్యంగా అభినందిస్తున్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చేస్తున్న దుర్మార్గాలపై పోరాడుతున్న తెలుగుదేశం పార్టీని పలువురు రహస్యంగా అభినందిస్తున్నారని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే వారంతా బహిరంగంగా తమను వెనకేసుకొచ్చే రోజులు రానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో టీఆర్ఎస్ లో చేరి, నేడు తిరిగి టీడీపీలోకి వచ్చిన శ్రీనివాసరెడ్డిని అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, టీఆర్ఎస్ నేతలు భయపడేది టీడీపీకి మాత్రమేనని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో సైబరాబాద్ ను నిర్మించగా, కేసీఆర్ వచ్చిన తరువాత నగరం చెత్తతో నిండిపోయిందని, కేటీఆర్ పలు పర్యటనలు జరిపినా రోడ్ల పరిస్థితి మారలేదు సరికదా, మరింతగా చెడిపోయిందని ఆయన విమర్శించారు. తమకు సేవ చేస్తారని నమ్మి గెలిపించిన కార్పొరేటర్లు వసూళ్ల ఏజంట్లుగా మారారని ఆరోపిస్తూ, ప్రజలు వారిని చీదరించుకుంటున్నారని అన్నారు.