: బ్యాంకు ఖాతాదారులకు రక్షణగా రఘురాం రాజన్ చేసిందిదే!
రఘురాం రాజన్... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పదవీ విరమణ చేసిన వ్యక్తి. మూడేళ్ల క్రితం ఆ పదవిని చేపట్టిన నాటి నుంచి దేశ ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తపనపడి ఎన్నో అవమానాలు ఎదురైనా శ్రమించి భారత పారిశ్రామిక వర్గాల నుంచి సాధారణ ప్రజల వరకూ అందరి మన్ననలూ అందుకున్న వ్యక్తి. దేశంలో బ్యాంకులు బాగుపడాలని అనునిత్యమూ తపనపడుతూనే, ప్రజలు, ముఖ్యంగా బ్యాంకు ఖాతాదారుల మేలు కోరి వారి రక్షణ నిమిత్తం పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమల్లోకి తెచ్చారు. అంతకుముందు ఆర్బీఐ గవర్నర్లు చేయలేకపోయిన, రఘురాం చేసిన పనుల్లో మచ్చుకు కొన్ని. పాడైపోయిన కరెన్సీ నోట్లు: ఇప్పటికీ నగదు ఆర్థిక వ్యవస్థ అధికంగా కొనసాగుతున్న ఇండియాలో పాడైపోయిన కరెన్సీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన తొలగించారు. ప్రజలు తమ వద్ద ఉన్న పాడైపోయిన నోట్లను రోజుకు 20 వరకూ (గరిష్ఠంగా వాటి విలువ రూ. 5 వేలకు మించకుండా) ఏ బ్యాంకు కైనా తీసుకువెళ్లి ఉచితంగా మార్చుకోవచ్చు. అంతకుముందు చిరిగిన నోట్లను బ్రోకర్ల వద్ద మార్చుకుని వారికి కమిషన్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకులకు వెళ్లినా వారు సక్రమంగా స్పందించేవారు కాదు. దీన్ని గమనించిన రాజన్ చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉచిత క్రెడిట్ స్కోరు: ఓ బ్యాంకు ఖాతాదారుడు, తన క్రెడిట్ స్కోరును తెలుసుకోవాలంటే ఎంతో ఇబ్బంది పడాల్సిన రోజులు పోయాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ప్రతి కస్టమర్ కూ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో పూర్తి రిపోర్టును సంవత్సరంలో ఒకసారి తప్పనిసరిగా, ఉచితంగా ఇచ్చేలా రాజన్ గవర్నర్ గా ఉన్న సమయంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ మోసాలపై..: ఏదైనా ఎలక్ట్రానిక్ మోసం జరిగినప్పుడు సదరు ఖాతాదారుడిపై ఎలాంటి కేసులు, విచారణలు లేకుండా కూడా రాజన్ సంస్కరణలు తీసుకువచ్చారు. ఆన్ లైన్ లావాదేవీలు తప్పుగా జరిగినా, అధిక మొత్తాలు జమైనా, ఫండ్ ట్రాన్స్ ఫర్ మోసాలు జరిగినా, దాన్ని తాను గుర్తించిన మూడు రోజుల్లోగా బ్యాంకుకు తెలియజేస్తే, ఏ ఆరోపణలూ ఖాతాదారుపై రాకుండా నిబంధనలను మార్చారు. ఇక మూడు నుంచి వారం రోజుల్లోగా తప్పును బ్యాంకుకు వివరిస్తే, గరిష్ఠంగా రూ. 5 వేలు మాత్రమే జరిమానా పడుతుంది. సేవింగ్స్ ఖాతాల కనీస మొత్తాలపై..: ఓ ఖాతాదారుడి ఖాతాలో కనీస మొత్తం లేదంటూ బ్యాంకులు జరిమానాలు విధించడాన్ని రాజన్ అడ్డుకున్నారు. కనీస మొత్తం బ్యాంకు ఖాతాలో లేదంటే, సదరు ఖాతాదారుడికి విషయాన్ని తెలిపి, ఆ మొత్తాన్ని జమ చేసేందుకు నెల రోజులు గడువు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన తెచ్చారు. కార్డు మోసాలను అడ్డుకునేందుకు..: క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలను అడ్డుకునేందుకు చిప్ ఆధారిత, పిన్ ఆధారిత కార్డులను మాత్రమే జారీ చేయాలని బ్యాంకులను ఆదేశించిన రాజన్, కార్డు లావాదేవీలను మరింత సురక్షితం చేశారు.