: మరో చిన్నారి గుండె ఆపరేషన్‌కు సాయం చేసిన సినీ నటుడు లారెన్స్.. ఇప్పటికి 130 మందికి సాయం!
నృత్యదర్శకుడిగానే కాకుండా సినీ నటుడిగా, దర్శకుడిగా దక్షిణాది చిత్రాల్లో రాణిస్తోన్న రాఘవ లారెన్స్ తన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈయన ఇప్పటికే 129 మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స కోసం ఆర్థిక సాయం అందించారు. తాజాగా అభినేష్ అనే మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించడం కోసం ఆయన ఆర్థిక సాయం చేశారు. దీంతో ఆయన నుంచి గుండె శస్త్ర చికిత్సకు కోసం సాయం అందుకున్న వారి సంఖ్య 130కి చేరుకుంది. సామాజిక స్పృహ, బాధ్యతను హృదయం నిండా నింపుకున్న లారెన్స్ వికలాంగ, అనాథాశ్రమాలను నెలకొల్పి ఎంతోమందికి కొత్త జీవితాలను ఇస్తున్నారు. మరెంతో మందిని దత్తత తీసుకుని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. తన కన్నతల్లిపై ఎనలేని ప్రేమను కనబరిచే లారెన్స్ ఆమెకు చిహ్నంగా ఒక గుడిని కూడా కట్టిస్తున్నారు. ఆ గుడిలో తన తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.