: మల్లన్న ఆభరణాలను సాగర్ బాబు కాజేశాడా?... శ్రీశైలం మాజీ ఈవో లాకర్లో వెండి బిందె!
శ్రీశైలం దేవస్థానం ఈవోగా పనిచేసిన విజయసాగర్ బాబు... మల్లన్న ఆభరణాలను కాజేశాడన్న కోణంలో వెలుగు చూసిన వార్తలు పెను కలకలం రేపుతున్నాయి. ఇటీవలే విజయవాడలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సాగర్ బాబుపై అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సాగర్ బాబు దాచేసిన రూ.60 కోట్ల మేర అక్రమాస్తులు బయటపడ్డాయి. విజయవాడలోని ఆంధ్రా బ్యాంకు లాకర్ లో దొరికిన నోట్ల కట్టలపై శ్రీశైలం టెంపుల్ బ్రాంచ్ కు చెందిన స్టిక్కర్లు ఉన్న విషయం ఏసీబీ అధికారులను షాక్ కు గురి చేసింది. ఈ క్రమంలో శ్రీశైలం, గుంటూరుల్లోని ఆంధ్రా బ్యాంకు లాకర్లను తెరచిన అధికారులకు మల్లన్నకు దాతలిచ్చినట్లుగా భావిస్తున్న ఓ వెండి బిందె, కొన్ని పాత్రలు కనిపించాయి. దీంతో సాగర్ బాబు... మల్లన్నకు దాతలు ఇచ్చిన ఆభరణాలను కూడా కొట్టేశాడన్న అనుమానాలు బలపడ్డాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏసీబీ అధికారులు మల్లన్న ఆభరణాలు దాచిన ఆంధ్రా బ్యాంకు లాకర్ ను నేటి ఉదయం ఓపెన్ చేశారు. ఇప్పటిదాకా భక్తుల నుంచి మల్లన్నకు అందిన బహుమతుల జాబితా ముందు పెట్టుకున్న అధికారులు ఆభరణాలను పోల్చి చూస్తున్నారు. ఈ ప్రక్రియ రేపు కూడా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ ఆభరణాల పరిశీలన పూర్తి అయితే తప్పించి సాగర్ బాబు... మల్లన్న ఆభరణాలను కొట్టేశాడా? లేదా? అన్న విషయం తేలదన్న భావన వ్యక్తమవుతోంది.