: చచ్చయినా సరే డబ్బు కట్టు!: సూపర్ టెక్ కు సుప్రీం ఆదేశం


"సంస్థ నష్టాల్లో ఉందని, దివాలా తీసే స్థితిలో ఉందని చెబితే ఊరుకునేదిలేదు. నువ్వు నిండా మునిగినా లేదా చచ్చినా ఇన్వెస్టర్లకు డబ్బు కట్టాల్సిందే" అంటూ నిర్మాణ రంగ సంస్థ సూపర్ టెక్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మీరు చచ్చిపోతున్నా మాకు అనవసరం. మీ ఆర్థిక పరిస్థితి గురించి మేము పట్టించుకోబోము. డబ్బిచ్చి ఇళ్లు కొన్నవారికి ఇళ్లు ఇవ్వలేదు కాబట్టి వారికి నెలకు 10 శాతం చొప్పున డబ్బు చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. మొత్తం 17 మంది కస్టమర్లకు మొత్తం డబ్బును చెల్లించే విధానానికి సంబంధించిన చార్టును తదుపరి విచారణలోగా కోర్టుకు సమర్పించాలని తీర్పిచ్చింది. అంతకుముందు సూపర్ టెక్ తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు బ్యాంకర్ మాదిరిగా వ్యవహరించడం కూడదని, సమన్యాయ సూత్రం పాటించాలని చెప్పినప్పటికీ కోర్టు వినిపించుకోలేదు. యూనీటెక్ తో తమకు ఓ కేసు నడుస్తోందని, తన క్లయింట్ సంస్థ పెట్టిన పెట్టుబడులు వెనక్కు రాలేదని, అందరు కొనుగోలుదారులూ సంస్థకు వ్యతిరేకంగా లేరని వాదించినా కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కాగా, ఎమరాల్డ్ టవర్స్ పేరిట అపార్ట్ మెంట్ల నిర్మాణాన్ని చేపట్టి, ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు స్వీకరించిన సూపర్ టెక్ సమయానికి ఫ్లాట్లను అప్పగించడంలో విఫలం కాగా, పెట్టుబడిదారులు కోర్టుకు వెళ్లారు. మొత్తం 40 అంతస్తులుండే భవనాలను సూపర్ టెక్ నిర్మించతలపెట్టగా, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ప్రాజెక్టును కేంద్రం అడ్డుకోవడం, భాగస్వామిగా ఉన్న యునిటెక్ తప్పుకోవడంతో సంస్థ ఇబ్బందుల్లో పడింది.

  • Loading...

More Telugu News