: బుధవారమే ఫైనలన్న చంద్రబాబు!... దిగొచ్చిన కేంద్రం!
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసిన కేంద్రం... ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనను కూడా వాయిదా వేసేందుకు యత్నించిందట. ఈ క్రమంలో నిన్న ప్రత్యేక ప్యాకేజీపై సుదీర్ఘ మంతనాలు సాగించిన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ సందేశం పంపారు. ఈ సందర్భంగా ప్రధాని విదేశీ పర్యటనను వారు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రధాని విదేశీ పర్యటనకు వెళుతున్నందున ఈ నెల 8న కాని, లేదంటే 9న కాని ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని వారు చంద్రబాబుకు సమాచారాన్ని చేరవేశారట. అయితే ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న కేంద్రం తీరుపై చంద్రబాబు భగ్గుమన్నారు. మరోసారి వాయిదా మాట కేంద్ర మంత్రుల నోట వినగానే ఆయన కాస్తంత కటువుగానే మాట్లాడారట. ‘‘ఇప్పటికే ఆలస్యం జరిగిపోయింది. అన్ని పార్టీల వారు బహిరంగ సమావేశాలు పెట్టాక ప్రకటన చేస్తే ఏం లాభం? ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం ప్రకటన చేయాల్సిందే. లేకపోతే... ఈ విషయంలో మీకిక ఫోన్లు చేసేదే లేదు. తర్వాత మీ ఇష్టం’’ అని చంద్రబాబు ముక్తాయించారట. దీంతో జైట్లీ, వెంకయ్య అప్పటికప్పుడు ప్రధాని వద్దకు ఉరుకులు పరుగులు పెట్టారు. మరింత ఆలస్యం చేస్తే నష్టం తప్పదని వారు ప్రధానికి విన్నవించి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సంబంధించి మోదీ వద్ద ఆమోదం తీసుకున్నారట. మోదీ కూడా ఓకే అనడంతో నేడే వారు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు తుది నిర్ణయం తీసుకున్నారని సమాచారం.