: 3 రోజుల సమావేశాల్లో ఏం మాట్లాడదాం?... అసెంబ్లీ వ్యూహరచనకు నేడు వైసీఎల్పీ భేటీ!
రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. తొలి రోజు సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రతిపాదించిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) బిల్లుపైనే చర్చ జరగనుంది. జీఎస్టీ బిల్లుకు ఇప్పటికే కేబినెట్ లో ఆమోద ముద్ర వేసిన చంద్రబాబు సర్కారు... అసెంబ్లీలోనూ ఆ బిల్లుకు ఆమోదం పొందాల్సి ఉంది. ఈ క్రమంలో తొలి రోజు సమావేశాలు సాంతం జీఎస్టీ బిల్లు చుట్టూనే తిరగనున్నాయి. ఇక మిగిలిన రెండు రోజులు మాత్రమే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో ఆ మిగిలిన రెండు రోజుల్లో ఏఏ అంశాలను ప్రస్తావించాలన్న అంశంపై విపక్షం వైసీపీ వ్యూహాన్ని రచిస్తోంది. ఈ వ్యూహ రచన కోసమే ఆ పార్టీ శాసనసభాపక్షం నేడు సమావేశమవుతోంది. సభలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.