: నేతాజీ 'గ్రేట్ ఎస్కేప్' కారుకి పునర్వైభవం తేనున్న 'ఆడి' సంస్థ!


ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపయోగించిన 'గ్రేట్ ఎస్కేప్' కారుకు పునర్వైభవం రానుంది. దశాబ్దాలుగా కదలకుండా ఓ అద్దాల గదిలో ఉన్న ఆ కారును తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు 'ఆడి' సంస్థ అంగీకరించింది. ఈ మేరకు జర్మన్ కు చెందిన 'ఆడి' కార్ల సంస్థతో నేతాజీ రీసెర్చ్ బ్యూరో (ఎన్ఆర్బీ) ఒప్పందం చేసుకుంది. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో ఒకసారి నేతాజీని బ్రిటిష్ సేనలు గృహ నిర్బంధం చేశాయి. ఇంటి చుట్టూ బ్రిటిష్ సేనలు, నిఘా అధికారులు కాపలా కాస్తున్న సమయంలో వారందరి కళ్లుగప్పిన సుభాష్ చంద్రబోస్ మేనళ్లుడు శిశిర్ బోస్ ఈ కారును నడుపుతుండగా, 1941 జనవరి 16న నేతాజీ కోల్ కతాలోని ఎల్గిన్ రోడ్డులోని తన నివాసం నుంచి గోమో ప్రాంతానికి (ప్రస్తుతం జార్ఖండ్లో ఉంది) వెళ్లిపోయారు. ఆ తరువాత ఆయన అక్కడి నుంచి అఫ్గనిస్థాన్, వయా కాబూల్, మాస్కో ద్వారా జర్మనీ చేరుకున్నారు. దీనినే చరిత్రలో 'గ్రేట్ ఎస్కేప్'గా అభివర్ణిస్తారు. ఆ తరువాత ఆ కారు వినియోగంలో లేదు. ప్రస్తుతం దీనిని నేతాజీ ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్ లోని అద్దాల గదిలో ఉంచుతున్నారు. 1937లో జర్మనీలోని 'వాండరర్ సెడాన్' కంపెనీ ఈ కారును తయారు చేయగా, దీనికి త్వరలో 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఆర్బీ చైర్ పర్సన్ కృష్ణ బోస్ ఆడి కార్ల సంస్థను సంప్రదించి కారు గురించి వివరించి, దానిని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు. దీనికి ఆ సంస్థ అంగీకారం తెలపడంతో, వింటేజ్ కార్ల నిపుణుడు పల్లాబ్ రాయ్ సమక్షంలో ఈ కారు పునర్వైభవం సంతరించుకోనుంది. డిసెంబర్ నాటికి దీని పునరుద్ధరణ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News