: విలేకర్లతో కలిసి ప్రచారానికి సిద్ధమైన హిల్లరీ క్లింటన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగి దూసుకెళుతోన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మీడియా ప్రతినిధులతో కలిసి తన ప్రచారాన్ని కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఏడాదిన్నరగా ప్రచారాన్ని కొనసాగిస్తోన్న క్లింటర్ తన ప్రచారం కోసం తన విమానంలోకి విలేకర్లకు అనుమతినివ్వలేదు. తాజాగా తొలిసారిగా విమానంలో ప్రచారానికి 40 మంది మీడియా ప్రతినిధులకు అనుమతినిచ్చారు. ‘స్ట్రాంగర్ టు గెదర్’ నినాదంతో ఉన్న బోయింగ్ 737 విమానంలో ఆమె మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. విలేకర్లలతో ప్రచారం ప్రారంభిద్దామనుకున్న ఇటువంటి సమయం కోసం తాను ఎదురు చూస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో 'ఇక మీరు సిద్ధమేనా? నేను సిద్ధమే' అని అన్నారు. తుది దశ ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ తో పోలిస్తే హిల్లరీ మార్జిన్ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆమె లీడింగ్ లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.