: 'మంచిగా చేశాం'... తనకు తాను కితాబిచ్చుకున్న చైనా!


ప్రపంచంలోనే అతిపెద్ద ఈవెంట్లలో ఒకటైన అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల సమాఖ్య, జీ-20 సమావేశాలను తాము మంచిగా నిర్వహించామని చైనా తనకు తాను కితాబిచ్చుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధీనంలోని 'గ్లోబల్ టైమ్స్' దినపత్రిక ప్రత్యేక సంపాదకీయాన్ని ప్రచురించింది. "ఈ సదస్సులో చైనా తప్పులు చేసిందని కొన్ని దేశాల మీడియా ఆరోపిస్తోంది. కానీ సమావేశం యావత్తూ సాఫీగా సాగిపోయింది. సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నాం" అంటూ ఎయిర్ పోర్టులో అమెరికా అధికారులతో జరిగిన వాగ్యుద్దాన్ని తేలికగా కొట్టి పారేసే ప్రయత్నం చేసింది. ఎన్నో సవాళ్ల మధ్య జీ-20 సదస్సును తాము నిర్వహించామని, కొన్ని వివాదాలు చెలరేగినా, అవి ముగిసిపోయినవిగా భావించాల్సినవేనని పేర్కొంది. ఈ సదస్సు తరువాత జపాన్, దక్షిణ కొరియా దేశాలతో చైనా సంబంధాలు మెరుగపడ్డాయని వెల్లడించింది. పశ్చిమ దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఈ దిశగా బలమైన అడుగులు పడ్డాయని వెల్లడించింది. ప్రపంచం ఏకతాటిపై నడిచేందుకు చైనా తన వంతు పాత్రను పోషిస్తుందన్న సంకేతాలు వెలువడ్డాయని, చైనాకు ఆ శక్తి ఉందని కూడా ఈ సదస్సు రుజువు చేసిందని తెలిపింది.

  • Loading...

More Telugu News