: ఆ గ్రంథాలయంలో పుస్తకాలు తిరిగివ్వకపోతే జైలుకి పంపిస్తారు!
పుస్తకాన్ని ఓ మంచి స్నేహితుడు, గురువుతో పోల్చుతారు. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం మాత్రం కొనుక్కో' అంటుంటారు. విజ్ఞాన గనిలా అందరికీ అందుబాటులో పుస్తకాలను ఉంచే చోటు గ్రంథాలయాలు. అన్ని పుస్తకాలూ ఒకే చోట ఉచితంగా చదువుకునే వీలును కల్పిస్తూ గ్రంథాయాలను కొనసాగిస్తున్నారు. వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి ఈ గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయి. ప్రపంచ విజ్ఞానాన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. అయితే, చదువుకోవడానికి గ్రంథాలయాల నుంచి కొందరు పుస్తకాలు తీసుకెళ్లి మళ్లీ తెచ్చి ఇవ్వని సంఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. లేదా వాటిలోంచి పుస్తకాలు తీసుకొని తిరిగి ఇవ్వడంలో ఎంతో ఆలస్యం చేస్తుంటారు. ఇటువంటి వారికి గ్రంథాలయాలు కొద్ది మొత్తంలో జరిమానా విధిస్తుంటాయి. అయితే, ఏథెన్స్‌లోని అలబామాలో ఉన్న ‘లైమ్‌స్టోన్ పబ్లిక్ లైబ్రరీ’లో పుస్తకాలు తీసుకెళ్లి తిరిగి ఇవ్వకపోతే మాత్రం జైలుకి వెళ్లాల్సిందే. తమ గ్రంథాలయం నుంచి పలువురు తీసుకెళ్లిన పుస్తకాలను రాబట్టే క్రమంలో ఈ గ్రంథాలయం పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ వద్ద నుంచి పాఠకులు తీసుకెళ్లిన 2 లక్షల విలువైన పుస్తకాలను తిరిగితెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని కోసం తమ గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకెళ్లిన వారి మొబైల్‌కి ముందుగా మెసేజ్, తర్వాత ఈమెయిల్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. మెసేజ్‌లకు వారు స్పందించకపోతే న్యాయస్థానం నుంచి సమన్లు అందుకుంటారు. అయినప్పటికీ వారి నుంచి స్పందన రాకపోతే ఇక వారిని జైల్లో పెడతారు. పుస్తకాలు తీసుకెళ్లి తిరిగి ఇవ్వని ఇటువంటి వారికి నెల రోజుల శిక్ష, 100 డాలర్ల జరిమానా వేస్తారు. తమ గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన పుస్తకాలను తిరిగి సంపాదించుకునే క్రమంలో ఇలాంటి చర్యలు చేస్తున్నామే తప్ప ఇంకెలాంటి ఉద్దేశం లేదని ఈ గ్రంథాలయ సిబ్బంది పేర్కొన్నారు. పుస్తకాలు తిరిగివ్వమని పాఠకులను తాము అడిగితే పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయని గ్రంథాలయ సిబ్బంది చెప్పారు. గ్రంథాలయ సభ్యత్వ కార్డును తమ బంధువులు, ఫ్రెండ్స్‌కి ఇచ్చామని కొందరు; తీసుకెళ్లిన పుస్తకాలు పోయాయని మరికొందరు పాఠకులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారంటూ వారు చెప్పారు. తమ లైబ్రరీ నుంచి వేల సంఖ్యలో పుస్తకాలు ఇలానే తిరిగి రాకుండా పోయాయని తెలిపారు. గ్రంథాలయ పుస్తకాలు తిరిగి ఇచ్చినప్పుడే మిగతా వారు వాటిని చదువుకుంటారని అందరికీ మేలు జరుగుతుందని అన్నారు. ఇప్పుడు తమ ప్రయత్నం మంచి ఫలితాల్నే ఇస్తుందని పేర్కొన్నారు. తాము పుస్తకాలను తిరిగి ఇవ్వని పాఠకులను జైలుకు పంపించే ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడు కేసులు ఎక్కువగానే నమోదయ్యాయని ప్రస్తుతం అరెస్టులు తగ్గాయని వారు తెలిపారు. ఈ ఆలోచన మంచి మార్పునే తీసుకొచ్చినట్లుందని అన్నారు.