: రేపటి నుంచి అందుబాటులోకి 'డిజీలాకర్'... జేబులో డీఎల్, ఆర్సీలు మోసుకెళ్లడం అక్కర్లేదు!
వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) తదితరాలను జేబులో పెట్టుకుని ప్రయాణించాల్సిన అవసరం ఇక లేదు. బుధవారం నాడు కేంద్ర రవాణా, ఐటీ శాఖలు సంయుక్తంగా విడుదల చేసే 'డిజీలాకర్'ను వినియోగించుకుంటే ఈ ఇబ్బంది తప్పుతుంది. డిజీలాకర్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఓ ఖాతాను తెరచి మొబైల్ నంబర్, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకుని, వాటిల్లోకి డీఎల్, ఆర్సీలను డైరెక్టుగా అప్ లోడ్ చేసుకుంటే చాలు. ప్రయాణాల వేళ, అధికారులు తనిఖీలు జరిపినప్పుడు మీ డిజీలాకర్ లోని పత్రాలను ట్రాఫిక్ పోలీసులు పరిశీలిస్తారు. "వెరిఫేకషన్ అధికారి వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లో ఇదే యాప్ ఉంటుంది. అతను మీ సాఫ్ట్ డాక్యుమెంట్లను పరిశీలిస్తాడు. ప్రస్తుతం తెలంగాణ, ఢిల్లీ రాష్ట్రాల్లోని ట్రాఫిక్ పోలీసులు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మరింత మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీని కలిగివున్నారు. ఈ చలాన్ల జారీలోనూ ఈ రాష్ట్రాలు మరింత పనితీరును కనబరుస్తున్నాయి" అని రవాణా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ యాప్ ను ఉపయోగించే నిబంధనల ఉల్లంఘనలపై పెనాల్టీ పాయింట్లు జారీ అవుతాయని ఆయన వెల్లడించారు.