: జియోతో ఎయిర్ టెల్ కు నష్టమే... కానీ శాశ్వతం కాదంటున్న ఎస్ అండ్ పీ


ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మార్కెట్ కు వచ్చిన తరువాత ప్రధాన టెలికం సంస్థ ఎయిర్ టెల్ కు నష్టం తప్పకపోవచ్చని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని, ఆపై తిరిగి నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది. డేటా టారిఫ్ విభాగంలో నెలకొన్న పెను పోటీ, ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్లు తదితరాలు ఎయిర్ టెల్ నిర్వహణా లాభాలను దెబ్బతీయనున్నాయని పేర్కొంటూ, జియో ప్రవేశంతో భారత టెలికం రంగం కొంత అనిశ్చితిలో పడిందని, ఎయిర్ టెల్ దేశవాళీ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో 5 శాతం మేరకు పడిపోవచ్చని అంచనా వేసింది. రిలయన్స్ జియో ఆవిష్కరణ తరువాత, మరింత పోటీ పెరిగినప్పటికీ, భారతీ ఎయిర్ టెల్ రేటింగ్ కు ఏమీ ప్రమాదం లేదని ఎస్ అండ్ పీ పేర్కొంది. "మా అంచనాల మేరకు, భారతీ ఎయిర్ టెల్ ఆర్థిక స్థితి బలంగానే ఉంది. జియో బ్రాండ్ పేరిట రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగో తరం వాయు తరంగాలను అత్యంత చౌక ధరలకు ఆఫర్ చేయడం ఎయిర్ టెల్ ను ఒత్తిడిలోకి నెట్టే అంశమే. వచ్చే రెండు మూడేళ్లలో నిర్వహణా నిధి 25.4 శాతం నుంచి 23 శాతానికి తగ్గవచ్చు. 20 శాతం కన్నా తగ్గితేనే ఎయిర్ టెల్ రేటింగ్ ను తగ్గించే ఆలోచన చేస్తాం" అని పేర్కొంది. దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా యాక్టివ్ సెల్ ఫోన్ కస్టమర్లతో రిలయన్స్ కు గట్టి పోటీని ఇచ్చే స్థితిలోనే ఎయిర్ టెల్ ఉందని ఇప్పటికే ఆ సంస్థ 4జీ సేవలను తనకున్న సర్కిళ్లలో విజయవంతంగా అందిస్తుండగా, కేవలం 1.5 నుంచి 2 కోట్ల మంది కస్టమర్లతో రంగంలోకి దిగిన జియో ఎంతో దూరం ప్రయాణించాల్సి వుందని అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News