: కర్ణాటక, తమిళనాడు మధ్య టెన్షన్ వాతావరణం.. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు
తమిళనాడుకు కావేరి జలాలివ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో కర్ణాటక రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మాండ్యాలో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చెలరేగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. బెంగళూరు-మైసూరు జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. మరోవైపు కావేరి జలాల వివాదంపై నేడు అఖిలపక్ష భేటీకి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. న్యాయస్థానం తమిళనాడుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ఈ భేటీలో చర్చించనున్నారు. తమిళనాడుకు కావేరి జలాలను ఇవ్వలేమని కర్ణాటక అత్యున్నత న్యాయస్థానం ముందు వాదించింది. అయితే, అన్ని వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కావేరి జలాల్లో 15 వేల క్యూసెక్కుల నీటిని పది రోజుల పాటు విడతలవారీగా అందజేయాలని తీర్పునిచ్చింది. దీంతో కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.