: ముస్లిం పిల్లలకు ఖురాన్ బోధిస్తున్న హిందూ బాలిక!
ఖురాన్.. ముస్లింల పవిత్ర గ్రంథం. ఇందులోని అరబిక్ పదాలు చాలా కఠినంగా ఉంటాయి. అయినా 18 ఏళ్ల పూజా కుష్వావాహకు అవేవీ అడ్డం కాలేదు. ముస్లిం చిన్నారులకు ఖురాన్‌ను బోధిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. ఆగ్రాలోని సంజయ్‌నగర్ కాలనీకి చెందిన పూజ 12వ తరగతి చదువుతోంది. ఖురాన్‌పై తనకున్న పట్టుతో ఆ కాలనీలోని 35 మంది ముస్లిం చిన్నారులకు దానిని బోధిస్తోంది. హిందూ బాలిక అయినా ఖురాన్‌ను చాలా చక్కగా బోధిస్తుండడంతో ముస్లిం కుటుంబాలు తమ పిల్లలను పూజ వద్దకు పంపుతున్నారు. ఐదేళ్ల చిన్నారి అలీషా తల్లి రేష్మా బేగం మాట్లాడుతూ పూజ ప్రతిభకు తాము ముగ్ధులమైనట్టు పేర్కొంది. ఇంత చిన్న వయసులోనే ఆమె ఖురాన్‌ను అద్భుతంగా బోధిస్తోందని తెలిపింది. ఆమె వద్దకు తమ పిల్లలను పంపడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. కాలనీలోని దాదాపు అన్ని కుటుంబాలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చాలా కాలం క్రితం ఇదే కాలనీలో సంగీతా బేగం అనే మహిళ ఉండేది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి హిందూ. పిల్లలకు ఆమె ఖురాన్ క్లాసులు చెప్పేది. దీంతో పూజకు కూడా అది నేర్చుకోవాలన్న తపన కలిగింది. ఆమె కూడా క్లాసులకు హాజరయ్యేది.‘‘ఆ తర్వాత క్లాసులో అందరికంటే నేను ఖురాన్‌ను బాగా ఒంటబట్టించుకున్నా. కొన్ని కారణాల వల్ల సంగీత క్లాసులు చెప్పడం ఆపేసింది. దీంతో నేను చెప్పడం మొదలుపెట్టా’’ అని వివరించింది.