: ఏడేళ్ల నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేదల రక్తం తాగుతున్నాడు: మల్ రెడ్డి రంగారెడ్డి
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మంచిరెడ్డి కిషన్ రెడ్డి నయీం ప్రధాన అనుచరుడు శ్రీహరి ఎవరో తనకు తెలియదని చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయన కుమారుడు, ఆయన కలిసి శ్రీహరితో చేసిన భూఒప్పందాల సంగతేంటని ఆయన నిలదీశారు. పూర్తి సాక్ష్యాలతో తాను సిట్ చీఫ్ నాగిరెడ్డిని కలిశానని అన్నారు. శ్రీహరిని అరెస్టు చేసినప్పుడు ఆయన అవినీతిలో భాగమైన మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని సిట్ చీఫ్ ను ప్రశ్నించానని ఆయన తెలిపారు. ఆ తరువాతే తాను మీడియాకు ఆయన అవినీతి గురించి చెప్పానని ఆయన తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వాటిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఇదిలా ఉంచితే, నిన్న తాను సవాల్ చేసినట్టు ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ చర్చ కోసం తన అనుచరులుతో కలిసి వచ్చి కిషన్ రెడ్డి కూర్చున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నారు.