: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వినాయక చవితి సందడి... ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు వినాయక ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు వినాయక విగ్రహ ప్రతిష్ఠాపనకు సిద్ధమైన మండపాల వద్ద కోలాహలం మొదలైంది. పూజల కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. గణేశ్ చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ‘ఆవోపా’ వినాయక ఉత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో 120 కేజీల వెండి వినాయక విగ్రహాన్ని ఊరేగించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పల్లెలు పట్టణాల్లో పండుగ వాతావరణం సంతరించుకుంది. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం ఆలయంలో నేటి నుంచి 14వ తేదీ వరకు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ చవితి కోలాహలం మొదలైంది. హైదరాబాద్‌లోని పలు గణేశ్ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన కోసం మండపాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. కొన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వినాయక విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు విగ్రహాలు, పత్రి, ఫలాల కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీగా మారాయి.