: పాడె మీదనుంచి లేచి ఏం జరుగుతోందని ప్రశ్నించిన వ్యక్తి... గాంధీ ఆసుపత్రి వైద్యులకు తలనొప్పి వ్యవహారం!
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వైద్యులను ఇబ్బందుల్లో పడేసిన చిత్రమైన వైనం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రూపాలతండాకు చెందిన బి.బిక్కు (35) ఐదు రోజుల క్రితం మద్యం మత్తులో బైక్ పై నుంచి పడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనిని ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించగా, అతని మెదడులో రక్తనాళాలు గడ్డకట్టుకుపోయాయని, తక్షణం అతనిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఈనెల 1న బిక్కును కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ తీసి వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా బిక్కు పరిస్థితి గమనించిన అతని బంధువులు ఆయన మరణించాడని భావించారు. దీంతో వైద్యులకు చెబితే పోస్టుమార్టం చేస్తారన్న అనుమానంతో వైద్యులు, సిబ్బందికి తెలియకుండా ఈనెల 2న బిక్కును అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పాడె సిద్ధం చేస్తుండగా... స్పృహలోకి వచ్చిన బిక్కు ఏం జరుగుతోంది? అంటూ ప్రశ్శించాడు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. దీంతో గ్రామ మాజీ సర్పంచ్ వారిని నిలదీయడంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు బిక్కు మృతిచెందాడని చెప్పడంతోనే అంత్యక్రియలకు ప్రయత్నించామని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యేకు చెప్పగా, ఆయన వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో జరిగిన ఘటనపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన, గాంధీ ఆసుపత్రి వైద్యులను వివరణ కోరారు. దీంతో గాంధీ ఆసుపత్రి పాలన యంత్రాంగం ఘటనపై ఆరాతీయగా బిక్కు మృతి చెందిన సమాచారం వారి వద్ద లేదు. దీంతో అడ్మిట్ కేస్ షీట్లు పరిశీలించగా న్యూరోసర్జరీ విభాగంలో బిక్కు కేస్ షీట్ లభించింది. దీంతో దీనిపై విచారణ చేపట్టినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ జేవీరెడ్డి తెలిపారు. ప్రస్తుతం బిక్కు కొత్తగూడెం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.