: అన్నం పెట్టమని అడిగినందుకు చిన్నారి ప్రాణం తీసిన మహిళ!
అన్నం పెట్టమని అడిగిన పాపానికి ఓ సవతి తల్లి చిన్నారిని కొట్టి చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరెల్లీ జిల్లాలోని బిత్రాలో చోటుచేసుకుంది. వృత్తిరీత్యా బేల్దారీ అయిన షాహిద్ ఖాన్ అనే వ్యక్తికి సైఫ్, మహినూర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఆ చిన్నారుల తల్లి కొంత కాలం క్రితమే చనిపోవడంతో షాహిద్ ఖాన్ ఐదు నెలల క్రితం తబస్సుమ్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. మొదట్లో పిల్లల పట్ల ప్రేమ చూపించిన తబస్సుమ్ కొన్ని రోజుల నుంచి కోపాన్ని ప్రదర్శిస్తోంది. పాఠశాలకు వెళ్లి మధ్యహ్నభోజనం సమయంలో ఇంటికి వచ్చిన సైఫ్ అన్నం పెట్టమని ఆమెను అడిగాడు. సైఫ్‌తో ఆమె అన్నం లేదు వెళ్లిపోమ్మని చెప్పింది. దీతో సైఫ్ అన్నం కావాలని ఏడ్చాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తబస్సుమ్ ఆ చిన్నారిని చితక్కొట్టింది. మెడపై కూడా బలంగా కొట్టింది. దీంతో ఆ చిన్నారి స్పృహతప్పి పడిపోయాడు. ఆ చిన్నారి చెల్లి మహినూర్(4) తన అన్న పడిపోయి ఉన్నాడని నానమ్మకు చెప్పింది. సైఫ్ వద్దకు వచ్చి చూసిన ఆమె ఆ చిన్నారి మరణించాడని గమనించింది. ఘటనపై చిన్నారుల తండ్రి షాహిద్ పోలీసులకు సమాచారం అందించాడు. తల్లిలేని తన పిల్లలకు తల్లిలా ఉంటుందనుకొని పెళ్లి చేసుకుంటే తన కుమారుడి ప్రాణం తీసిందని ఆవేదన చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.